Skip to main content

TSCHE: ఎంసెట్‌కు అదనంగా కేంద్రాలు.. సెట్ల వారీగా దరఖాస్తుల సంఖ్య ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కు ఈసారి 50 వేల దరఖాస్తులు పెరగడంతో అదనంగా 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.
TSCHE
ఎంసెట్‌కు అదనంగా కేంద్రాలు.. సెట్ల వారీగా దరఖాస్తుల సంఖ్య ఇలా..

ఏపీలోనూ పరీక్ష కేంద్రాల పెంపు ఉంటుందని చెప్పారు. ప్రవేశ పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్‌ వైఎస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డితో కలిసి లింబాద్రి ఏప్రిల్‌ 2న  హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంసెట్‌ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఎంసెట్‌కు ఇప్పటికే 2.5 లక్షలకు పైగా విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌  చేసుకున్నారు. మే 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌  పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహిస్తాం. 2023లో 3.20 లక్షల దరఖాస్తులొచ్చాయి. అగ్రికల్చర్, మెడికల్‌కు 113, ఇంజనీరింగ్‌కు 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం’’ అని వివరించారు. 

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం.. 

విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ప్రొఫెసర్‌ లింబాద్రి స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలన్నారు. లాసెట్‌ను ఒకే రోజు మూడు సెషన్లలో నిర్వహిస్తున్నామని, ఎడ్‌సెట్‌ సైతం ఒకే రోజు మూడు సెషన్లల్లో పూర్తిచేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఈసెట్‌ ఒకే పూటలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్, కో–కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్, పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రవీంద్రారెడ్డి, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయలక్షీ, ఎడ్‌సెడ్‌ కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పారుపల్లి శంకర్‌ పాల్గొన్నారు. 

Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS

ప్రవేశ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు... 
ప్రతీ కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ 

టీఎస్‌పీఎస్సీ, పదో తరగతి పేపర్‌ లీకేజీల నేపథ్యంలో ఈ నెలలో జరగనున్న ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయి సిట్టింగ్‌ స్క్వాడ్‌ను (అబ్జర్వర్‌) నియమించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్షాకేంద్రంలో ఒకరు చొప్పన సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించనుంది. వీరు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రాలపై గట్టి నిఘాను పెడతారు. ప్రతీ పరీక్షాకేంద్రం వద్ద నలుగురు పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఇక సెల్‌ఫోన్లను పూర్తిస్థాయిలో నిషేదించారు. పరీక్షాకేంద్రాలు నో సెల్‌ఫోన్‌ జోన్లుగా అమలుపరుస్తారు. విద్యార్థులు, ఇన్విజిలెటర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది సహా అందరికీ ఈ నిబంధన వర్తించనుంది. ఒక్క అబ్జర్వర్‌కు మాత్రం పరీక్ష మొదలైన 15 నిమిషాల వరకే సెల్‌ఫోన్‌ వాడేందుకు అనుమతిస్తారు. అది కూడా పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారన్న సమాచారాన్ని చేరవేసేందుకు మాత్రమే. ఎంసెట్‌తో పాటు ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్‌లన్నింటికీ ఇదే నిబంధనలు వర్తిస్తాయి.

సెట్ల వారీగా దరఖాస్తుల సంఖ్య 

ప్రవేశ పరీక్ష

2023

2022

ఎంసెట్‌

3,20,587

2,66,714

ఎడ్‌సెట్‌

29,390

38,091

ఈసెట్‌

21,586

24,095

లాసెట్‌

41,439

36,332

ఐసెట్‌

43,242

75,952

పీజీఈసెట్‌

13,636

14,612

Published date : 03 May 2023 04:14PM

Photo Stories