Skip to main content

Spy Satellite: కక్ష్యలోకి రెండో నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా

దక్షిణ కొరియా దేశీయంగా తయారు చేసిన రెండో నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Second Spy Satellite Successfully Placed In Orbit, Says South Korea

ఈ ప్రయోగం ఏప్రిల్ 8వ తేదీ అమెరికాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష స్థావరం నుంచి స్పేస్‌ ఎక్స్‌ కంపెనీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా జరిగింది. కక్ష్యలోకి చేరిన ఈ ఉపగ్రహం పనితీరును అధికారులు అక్కడి నుంచి వస్తున్న సంకేతాల ద్వారా ధ్రువీకరించుకుంటున్నారు.

గత నవంబరులో ఉత్తర కొరియా ఒక సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత దక్షిణ కొరియా తన మొట్టమొదటి సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 2025 నాటికి మొత్తం ఐదు ఉపగ్రహాలను ప్రయోగించాలన్నది దక్షిణ కొరియా లక్ష్యం.

ఈ ఐదు ఉపగ్రహాల ద్వారా దక్షిణ కొరియా ఉత్తర కొరియాలోని ప్రధాన స్థావరాలన్నింటిపై నిఘా వేయగలదు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆయా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు అందుతాయని సియోల్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Agni Prime: అగ్ని-ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్

మరోవైపు, తమ నిఘా ఉపగ్రహం ద్వారా అమెరికాలోని కీలక నావికాస్థావరాల చిత్రాలను పంపినట్లు ఉత్తర కొరియా గతంలో తెలిపింది. అలాగే దక్షిణ కొరియాలోని ప్రముఖ ప్రదేశాల ఫొటోలు సైతం తమకు అందినట్లు పేర్కొంది.

ఉత్తర కొరియాకు రష్యా నుంచి మద్దతు లభిస్తున్నట్లు సియోల్‌ ఆరోపిస్తోంది. ఈ ఏడాది ప్యాంగ్యాంగ్‌ వర్గాలు దక్షిణ కొరియా తమ ప్రధాన శత్రువని ప్రకటించారు.

Published date : 08 Apr 2024 06:15PM

Photo Stories