Skip to main content

AP Agricultural Yields: ఏపీలో ఆహార ధాన్యాల రికార్డు స్థాయి దిగుబడులు

రాష్ట్రంలో 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి దిగుబడులు దుమ్మురేపాయి. గతేడాది కంటే మిన్నగా నమోదయ్యాయి.
Crop Production Update 2022-23, Department of Statistics - Directorate of Economics and Statistics, Comparative Agricultural Yields: 2021-22 vs. 2022-23, Crop Yield Statistics Infographic, Record yields of food grains in AP, Final Yield Estimates Report 2022-23,

 ఆహార ధాన్యాల దిగుబడులే కాదు.. అపరాలు, నూనె గింజలు, వాణిజ్య పంటల దిగుబడులు కూడా ఈసారి రికార్డు స్థాయిలోనే వచ్చాయి. 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తుది దిగుబడి అంచనాల నివేదికను అర్థగణాంక విభాగం (డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌) విడుదల చేసింది. దీని ప్రకారం 2022–23 వ్యవసాయ సీజన్‌లో 259.28 లక్షల టన్నుల దిగుబడులు రాగా.. ఇవి 2021–22తో పోలిస్తే 22.10 లక్షల టన్నులు అధికంగా నమోదయ్యాయి.

రికార్డు స్థాయిలో పత్తి, మిరప దిగుబడులు..

ఇక వాణిజ్య పంటల విషయానికొస్తే.. పత్తి 2021–22లో 13.85 లక్షల ఎకరాల్లో సాగయితే 12.74 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాగే, 2022–23లో 17.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, 15.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చా­యి. మరోవైపు.. మిరప 2021–22లో 5.62 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర ప్రభావంతో 4.18 లక్షల టన్నులకు పరిమితమైంది. అదే 2022–23లో 6.47 లక్షల ఎకరాల్లో సాగవగా, నల్లతామర నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 14.63 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి.

రైతు ఇంట ‘ధాన్యం’ సిరులు..

  • 2021–22 సీజన్‌లో కోటి 51 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 237.16 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఆ తర్వాత 2022–23 సీజన్‌లో వివిధ కారణాల వల్ల కోటి 39 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనప్పటికీ దిగుబడులు మాత్రం రికార్డు స్థాయిలో 259.28 లక్షల టన్నులు నమోదయ్యాయని ఆ విభాగం వెల్లడించింది. 
  • వీటిలో ప్రధానంగా 2021–22లో 60.30 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, హెక్టార్‌కు సగటున 5,048 కిలోల చొప్పున 121.76 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొచ్చాయి. 
  • అదే.. 2022–23లో 53.22 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా, హెక్టార్‌కు సగటున 5,932 కిలోల చొప్పున 126.30 లక్షల ధాన్యం దిగుబడులు నమోదయ్యాయి.
  • మొత్తం మీద చూస్తే 2021– 22లో కోటి 03 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవగా.. దిగుబడులు కోటి 55 లక్షల టన్నులు వచ్చాయి. 2022–23లో 92లక్షల ఎకరాలకుగాను కోటి 68 లక్షల టన్నుల దిగు బడులొచ్చాయి. 

అపరాలు, నూనె గింజలు కూడా..

  • అపరాల పంటలు 2021–22లో 30.67 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.55 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 
  • 2022–23లో 25.80 లక్షల ఎకరాల్లో సాగవగా, 10.87 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. 
  • ఇక నూనెగింజల పంటలు 2021–22లో 25.05 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.68 లక్షల టన్నులు.. 2022–23లో 20.30 లక్షల ఎకరాల్లో సాగవగా, 28.96 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. 
  • ​​​​​​​వీటిలో ప్రధానంగా కందులు 2021–22లో 6.27 లక్షల ఎకరాల్లో సాగయితే.. 68 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. అలాగే, 2022–23లో 6 లక్షల ఎకరాల్లో  సాగవగా, 78 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 
  • ​​​​​​​వేరుశనగ అయితే 2021–22లో 20.62 లక్షల ఎకరాల్లో సాగవగా, 5.15 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. 2022–23లో 14.85 లక్షల ఎకరాల్లోనే సాగవగా, 6 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. 

సగటు దిగుబడులు పెరిగాయి..

ఆర్థిక, గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021–22 సీజన్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ 2022–23లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదయ్యాయి. తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడంతో దాదాపు ప్రతీ పంటలోనూ హెక్టార్‌కు సగటు దిగుబడులు 2021–22తో పోలిస్తే పెరిగాయి

Published date : 24 Nov 2023 12:54PM

Photo Stories