ఐటీ కంపెనీలతోనే ఉద్యోగావకాశాలు
ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 26న బెల్లంపల్లి వాల్యూఫిచ్ ఈ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ‘సాక్షి’ఆధ్వర్యంలో ‘ప్రజా ఎజెండా’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే నేతలకు సూచనలు, సలహాలు చేశారు.
చదవండి: Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇదే!
ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం ఐటీ కంపెనీలు ఏర్పాటు అవుతుండడం శుభ పరిణామమని పేర్కొంటూనే.. ప్రైవేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఐటీ ఇతర పరిశ్రమలకు తగిన రాయితీలు, ప్రోత్సాహాకాలు అందజేయడం వల్ల మరిన్ని పరిశ్రమల విస్తరణకు అవకాశాలు మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగులు అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ప్రాజెక్టులు ఇవ్వాలి
ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం మరింత చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు మాత్రమే ప్రాజెక్టులను రాబట్టుకుని నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టులు రావడానికి ఎంతో వ్యయప్రయాసాలకు గురవుతున్నాయి. ఈ పరిస్థితులను అఽధిగమించడానికి ప్రభుత్వం ప్రాజెక్టులను అందివ్వడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది.
– డి.జ్యోతి, ఐటీ ఉద్యోగి, బెల్లంపల్లి
ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి
ప్రస్తుతం ప్రైవేట్ ఆధీనంలో ఐటీ కంపెనీలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ పరంగా అంతంత మాత్రంగానే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా పెద్ద పట్టణాల్లో ఏర్పాటు చేస్తుండడం వల్ల మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంత విద్యావంతులకు అవకాశాలు రావడం లేదు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీలు ప్రారంభించి నిరుద్యోగులకు అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించాలి.
– బి.భవానీ, ఐటీ ఉద్యోగి, బెల్లంపల్లి
మహిళలకు ఎంతో మేలు
ద్వితీయ శ్రేణి పట్టణాలు, మండల కేంద్రాల్లో ఐటీ కంపెనీల ప్రారంభానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. యువతులు, గృహిణులు నిర్భయంగా విధులకు వెళ్లడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటి పట్టున ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగం చేయడాన్ని మించిన ఆనందం ఇంకేముంటుంది. మున్సిపాలిటీల్లోనూ ఐటీ కంపెనీలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
– ఎం.ప్రగతి, ఐటీ ఉద్యోగి, బెల్లంపల్లి