Open 10th Class & Inter Admissions: సచివాలయాల్లో ‘ఓపెన్’ రిజిస్ట్రేషన్లు
అనంతపురం సిటీ: విద్యా సంస్థల్లో డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. చదువుకోవాలన్న తపన ఉన్నా.. వివిధ కారణాలతో బడి మానేసిన వారి కోసం ఓపెన్ టెన్త్, ఇంటర్ తరగతులు, పరీక్షలు నిర్వహించే వారు. దీన్ని మరింత సరళతరం చేస్తూ ఇక నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు అందాయని అనంతపురం డీఎల్‌డీఓ చిలంకూరు ఓబుళమ్మ సోమవారం తెలిపారు.
చదవండి: AP Open School Tenth and Inter Admissions 2023 : గుడ్‌న్యూస్.. ఇకపై ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు సచివాలయాల్లోనే.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
అడ్మిషన్ ఎలా పొందాలంటే..
ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని డీఎల్‌డీఓ తెలిపారు. దీని కోసం ఓపెన్ స్కూల్ సొసైటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉందని తెలిపారు. అదనపు రుసుంతో కలిపి అక్టోబర్ 5 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.