Skip to main content

AP SSC 10th Results 2024: పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌, కలెక్టర్‌ ప్రత్యేక ప్రణాళికతో..

AP SSC 10th Results 2024  Manyam district officials discussing exam strategies

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది 87.47 శాతం ఉత్తీర్ణతతో మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఫలితాల శాతం మరింత మెరుగుపరిచేలా తగిన కార్యాచరణతో అధికార యంత్రాంగం ముందునుంచి ప్రణాళిక ప్రకారం కృషి చేసింది. 

విద్యాసంవత్సరం మొదటినుంచే పదో తరగతి విద్యార్థులపై దృష్టిపెట్టిన అధికారులు..ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ సూచనలతో ప్రణాళికలను ఆచరణలో పెట్టారు. దీంతో పాటు కేజీబీవీల్లో వంద రోజు ల పంచతంత్ర ప్రణాళికను అమలు చేశారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ సూచనలతో ‘నా బడి–నాకు గర్వకారణం (మై స్కూల్‌ –మై ప్రైడ్‌) పేరిట కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద 182 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కలెక్టర్‌ మొదలుకుని జాయింట్‌ కలెక్టర్‌, పీవోలు, ఆర్డీవోలు, జిల్లా, డివి జన్‌, మండలస్థాయి వరకు ఒక్కో అధికారి ఒక్కో పాఠశాలను దత్తత తీసుకున్నారు. వారంతా పూర్తిగా పదోతరగతిపైనే దృష్టిపెట్టారు. ‘డి’ గ్రేడ్‌లో ఉన్న పిల్లలను ప్రతి సబ్జెక్టులోనూ ప్రోత్సహించారు.

వీరు కనీస మార్కులు కాకుండా, 50 శాతంపైగా మార్కులు సాధించే లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. పిల్లల పట్ల వ్యక్తిత్వ వికాస నిపుణులుగా వ్యవహరించారు. దీంతోపాటు ‘డాట్‌’ కార్యక్ర మం కింద ప్రతిరోజూ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించారు. దీనివల్ల విద్యార్థులకు పరీక్షల పట్ల భయంపోయి, సన్నద్ధత పెరగడానికి ఆస్కారం ఏర్పడింది.

వారాంతపు పరీక్షలు సైతం నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 100 శాతం ఫలితాలు సాధించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచతంత్ర (వంద రోజుల) ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. ప్రతి టీచర్‌ 15 మంది విద్యార్థులపై దృష్టిపెట్టారు.

స్టడీ ప్లానింగ్‌, వారాంతపు పరీక్షలు, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, తరచూ ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించారు. ఈ కారణాలతోనే నేడు ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

నాకు ఫస్ట్‌ ర్యాంకు వచ్చినట్లు ఉంది
పదో తరగతి ఫలితాల్లో వరుసగా రెండో ఏడాది రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. నాకే ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చినంత సంతోషంగా ఫీల్‌ అవుతున్నా. ఇది అందరి సమష్టి కృషి. గొప్ప సంతృప్తిని ఇచ్చింది. ఇందులో భాగస్వామ్యమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, దత్తత అధికారులు అందరికీ ఈ విజయం అంకితం. ఇదే స్ఫూ ర్తి భవిష్యత్తులోనూ కొనసాగాలి. జిల్లా ఆదర్శంగా నిలవాలి. జిల్లా విద్యాశాఖ అధికారిణి పగడాలమ్మకు, ఇతర జిల్లా అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా.

–నిషాంత్‌కుమార్‌, కలెక్టర్‌

Published date : 23 Apr 2024 01:20PM

Photo Stories