10th Class Exams: పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫిరెన్సు హాల్‌లో విద్య, వైద్య, విద్యుత్, పోలీస్, ట్రెజరరీ తదితర శాఖల అధికారులతో మార్చి 18 నుంచి 30వ తేది వరకు జరగబోయే పదోతరగతి పరీక్షలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదోతరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో చాలా కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి పదోతరగతి పరీక్షలపై వివిధ అంశాలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో 129 కేంద్రాల్లో 25వేల 522 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, వీరిలో 3056 మంది ఇంతకు ముందు ఫెయిల్ అయ్యి ఇప్పుడు రాస్తున్నారన్నారు. 13003 మంది విద్యార్థులు, 12519 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరు అవుతారని తెలిపారు. ఇదే తేదిలలో మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ కింద పదోతరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలకు 3051 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో 982 మంది పదోతరగతి.. 2069 మంది ఇంటర్ పరీక్షలు రాస్తారన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేయడంలో, జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడంతో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు వేసవికాలంలో నిర్వహిస్తున్నందున వడదెబ్బ తగలకుండా విద్యార్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. జీవితంలో పదోతరగతి పరీక్షలు ఒక చిన్న భాగం మాత్రమేనని, అదే జీవితం కాదని, పరీక్షలను ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ధికారి శివప్రకాష్‌రెఢ్డి, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ బాబు, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా, ఏపీ ఎస్పీడీసీఎల్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ కొండయ్య, ఆర్డీఓ దినేష్ చంద్ర, డీటీఓ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
చదవండి: Admissions in Model school: మోడల్ స్కూల్ పిలుస్తోంది..