Skip to main content

Free coaching: ఉచిత శిక్షణ

free coaching
free coaching

కార్వేటినగరం: జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో 2020–21లో రెండేళ్లపాటు రద్దు చేశారు. 2022 నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది గత నెల 29వ తేదీ నుంచి నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎన్నికల నేపథ్యంలో శిక్షణ తరగతులు వాయిదా వేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం వృథా కాకుండా వారిలో పఠనాశక్తిని కలిగించడం, గ్రంఽథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను ఆకట్టుకునేలా వివిధ అంశాలపై 40 రోజుల శిక్షణ ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్‌ 7వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు సమీప గ్రంథాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. వివిధ సంస్థలకు చెందిన నిపుణులు, తరగతులు నిర్వహిస్తారు.

రెండు విభాగాల్లో నిర్వహణ

పఠనం, సరదా అనే రెండు విభాగాల్లో శిక్షణ ఉంటుంది. పుస్తకపఠనం, కథలు చెప్పించడం, ప్రముఖులతో అవగాహన సదస్సులు, ఆటలపై ఆసక్తి ఉన్నవారికి చెస్‌,క్యారమ్స్‌ వంటివి నేర్పిస్తున్నారు. విజేతలకు పుస్తకాలతో పాటు కవులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలు, వివిధ దినపత్రికలు, చిన్నారులకు ఉపయోగపడే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేశారు. నృత్యం, పప్పెట్ల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇవ్వవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

సేవలకు అవకాశం

పేద విద్యార్థులకు స్వచ్ఛంద సేవ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, చెస్‌, డ్రాయింగ్‌, తెలుగులో మంచి ప్రతిభ ఉన్నవారు ఈ గ్రంథాలయాల ద్వారా స్వచ్చంధంగా సేవలు అందించేందుకు గ్రంథాలయ సంస్థ అవకాశం కల్పిస్తోంది. వేసవిలో ఇలాంటి సేవ ద్వారా ఎంతోమంది విద్యార్థు ల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆస్కారం ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి

వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి ఆదేశాలు వచ్చాయి. ఒక్కొక్క కేంద్రానికి రూ.10 వేలు బడ్జెట్‌ కేటాయించారు. గత ఏడాది విజయవంతంగా నిర్వహించాం. విద్యార్థులు అధికంగా సెల్‌ఫోన్లకే సమయం కేటాయించి చిన్న వయసులోనే కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు.

వేసవి సెలవుల్లో పిల్లలు గ్రంథాలయాలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సేకరించి నిత్యం శిక్షణకు వచ్చేలా చూడాలని సిబ్బందిని ఆదేశించాం. ఆసక్తి గల ఉపాధ్యాయులు, చిత్రలేఖనం, వృత్తి శిక్షణ పొందిన వారు గ్రంథాలయాల్లో విద్యార్థులకు సమయం కేటాయించేందుకు ముందుకు రావాలి.

Published date : 20 May 2024 07:08PM

Photo Stories