Survey: బడిబయటి పిల్లల గుర్తింపునకు సీఆర్పీల సర్వే
- బడిబయటి పిల్లల గుర్తింపునకు కసరత్తు
- ఈనెల 11 నుంచి మొదలైన సర్వే
- జనవరి 10 వరకు కొనసాగింపు
- 6 నుంచి 19 ఏళ్ల బాలబాలికలను గుర్తిస్తున్న అధికారులు
కరీంనగర్: ‘పెద్దలు పనికి.. పిల్లలు బడికి’ అన్న నినాదం నిజం చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. ఏటా బడిబయటి పిల్లల సర్వే చేసి, వారు పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 11నుంచి బడిబయటి పిల్లల గుర్తింపు కోసం జిల్లాలో సర్వే ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సీఆ ర్పీలు, ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించారు. 6–14 ఏళ్ల వయసు పిల్లలను ఒకవర్గంగా, 15–19 ఏళ్ల వయసు వారిని మరో విభాగంగా గుర్తిస్తారు. వివిధ కారణాలతో పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించి ఆయా తరగతుల్లో చేర్పిస్తారు.
- వచ్చే 2024–25 ఏడాదికి సంబంధించి బడిబయటి పిల్లలను సర్వే ద్వారా గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో 16 మండలాల్లోని సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఎల్‌ఎంటీ, ఐఈఆర్‌వీలు దృష్టి పెట్టాలని ఆదేశాలు వచ్చాయి.
- ఆరేళ్ల నుంచి 14ఏళ్లలోపు పిల్లలను ఒకవర్గంగా, 15ఏళ్ల నుంచి 19ఏళ్ల వరకు పిల్లలను మరో విభాగంగా గుర్తించారు. ఐఆర్‌పీ ఉపాధ్యాయులు సీడబ్ల్యూఎస్ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సర్వేను కొనసాగించాలని తెలిపారు.
- ఆరు నుంచి 19ఏళ్ల లోపు పిల్లల చదువులు ఆగి పోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే బడిబయట పిల్లల సర్వే ప్రక్రియను ఇటీవలే ప్రారంభించారు.
- ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, జిల్లా పరిశీలన బృందం, ఎంఐఎస్ సమన్వయకర్తలు, కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు.
- అంగన్‌వాడీకేంద్రాల్లో విద్యార్థుల సమాచారం సేకరిస్తూ వచ్చే జనవరిలో పూర్తిచేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సేకరించిన పి ల్లల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలి.
- బడికెళ్లకుండా ఉన్నత చదువులను ఆపేయటానికి కారణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు సేకరించాలి. నామమాత్రంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా నిర్వహించి కచ్చితమైన వివరాాలు సేకరించాలి.
- సర్వేలో గుర్తించిన విద్యార్థి సామర్థ్యం, వయస్సును పరిగణలోకి తీసుకొని తరగతుల్లో చేర్పించడం, దూరవిద్యలో ప్రవేశాలు కల్పించడం వంటివి చేస్తారు.
- అర్హత, ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత మూడేళ్లలో గుర్తించిన కొందరు పిల్లలను బడిలోని ఆయా తరగతుల్లో చేర్పించగా ఇంకొందరికి ఓపెన్ విద్య ప్రవేశాలు లభించే విధంగా చూసినట్లు అధికారులు తెలిపారు.
గత మూడేళ్లలో గుర్తించిన పిల్లలు
సంవత్సరం | పిల్లలు |
2021– 22 | 280 |
2022– 23 | 111 |
2023– 24 | 416 |
వచ్చేనెల 10 వరకు సర్వే
వివిధ కారణాలతో బడికి వెళ్లని పిల్లలను గుర్తించి వయసుకు తగిన తరగతిలో చేర్పిస్తున్నాం. అర్హులైన పిల్లలు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఏటా సర్వేలు చేస్తూ గుర్తిస్తున్నాం. చదువుపై ఆసక్తిని గుర్తించి పదోతరగతి, ఇంటర్ పూర్తిచేసేలా ఓపెన్‌విద్యలో చేర్చి వారి ఉన్నతికి కృషి చేస్తున్నాం. ఈనెల 11నుంచి సర్వే మొదలైంది. జనవరి10 వరకు కొనసాగుతుంది. వలస కార్మికుల కుటుంబాల పిల్లల కోసం ఇటుకబట్టీల వద్ద ఏర్పాటు చేసిన వర్క్‌సైట్ పాఠశాలల్లో చేర్పిస్తాం.
– కర్ర అశోక్‌రెడ్డి, ఎంఎమ్‌ఓ, సమగ్ర శిక్ష అభియాన్