Skip to main content

Training for Teachers: ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ

Professional training for teachers   Quality Education Priority in YSRCP Governance

విశాఖ విద్య: విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పర్యవేక్షణపై కూడా దృష్టి సారించింది. నాణ్యమైన చదువులు అందించడమే లక్ష్యంగా మండల స్థాయిలో విద్యాశాఖను బలోపేతం చేస్తూ ప్రతి మండలంలో ఇద్దరేసి ఎంఈవోలను నియమించింది. క్షేత్ర స్థాయిలో విద్యా కార్యక్రమాలు అమల్లో ఎంఈవోలే కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలను మరింత పటిష్టం చేసేలా అవసరమైన సామగ్రి సమకూర్చారు. జిల్లాలోని 11 మండలాల విద్యాశాఖ కార్యాలయాలకు కొత్త కంప్యూటర్‌, ప్రింటర్లను సరఫరా చేశారు. ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా కల్పించారు. మండల విద్యాశాఖ కార్యాలయాలకు అవసరమైన పరికరాలు సమకూరుతుండడంపై ఎంఈవోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 11 మండలాల్లో 54 కాంప్లెక్స్‌లు
జిల్లాలో ఉన్న 11 మండలాల్లోని ఎంఈవో కార్యాలయాలను బలోపేతం చేయడంతో పాటు, వీటి పరిధిలో ఉన్న 54 స్కూల్‌ కాంప్లెక్స్‌లను శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలలను సముదాయంగా ఏర్పాటు చేసి, సమీపంలో ఉన్న హైస్కూల్‌ను కాంప్లెక్స్‌గా గుర్తించి, ప్రతి నెలా ఇక్కడ ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాయామ ఉపాధ్యాయులకు సైతం స్కూల్‌ కాంప్లెక్స్‌ల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యకలాపాలన్నింటినీ ఎంఈవోలే పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ఎంఈవో–1, ఎంఈవో–2లకు పని సర్దుబాటు చేశారు.

ఎంతో ఉపయోగం
ఎంఈవో కార్యాలయాలకు కంప్యూటర్‌, ప్రింటర్‌ సరఫరా చేయడం సంతోషించదగ్గ విషయం. హై టెక్నాలజీతో కూడినవి కావడంతో వీటి వినియోగం బాగుంది. ఒకే రోజు 60 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన వార్షిక ఇంక్రిమెంటు బిల్లులు చేయగలిగాను. కార్యాలయ నిర్వహణకు అవసరమైన నిధులు కూడా సమ కూరిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
–ఎస్‌.ఎస్‌.పద్మావతి, ఎంఈవో–1, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా

Published date : 14 Dec 2023 09:48AM

Photo Stories