Dr. YSR Horticultural University: డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు..
తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని 11 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లమో కోర్సు ప్రవేశానికి గురువారం వర్సిటీలో కౌన్సెలింగ్ జరిగింది. 528 సీట్లకు ఆఫ్‌లైన్ పద్ధతిలో సీట్ల కేటాయింపు జరగ్గా.. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల కోసం చివరి కౌన్సెలింగ్ నిర్వహించారు. పలు జిల్లాలకు చెందిన 18 మంది ప్రవేశాలు పొందారు. ఈ సందర్బంగా వర్సిటీ వీసీ జానకీరామ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో హార్టీకల్చర్ ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. పలు అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయన్నారు. జాతీయ స్థాయిలో ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన వర్సిటీలో చదువుకునే అవకాశం రావడంతో భవిష్యత్‌కు మంచి పునాది పడుతుందన్నారు. ఇంటర్‌కు సమానమైన డిప్లమో కోర్సు చేసిన వారు నేరుగా జనరల్ డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ డిగ్రీలో ప్రవేశం పొందవచ్చన్నారు. వర్సిటీ పరిధిలోని బీఎస్సీ హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులో చేరడానికి హార్టీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం పొందవచ్చన్నారు. రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, పరిశోధనా సంచాలకులు ఎల్.నారం నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డీవీ స్వామి పాల్గొన్నారు.
చదవండి: Digital Training: టీచర్లు, విద్యార్థులకు డిజిటల్ శిక్షణ