Skip to main content

Air India Layoffs: సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ

Air India Layoffs   Dismissed Cabin Crew Announcement   Employee termination notice

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు ఇటీవల ముకుమ్మడిగా సిక్‌ లీవ్‌ తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సంస్థ బుధవారం దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్‌ సిబ్బందిని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. సిక్‌ లీవ్‌ తీసుకున్న అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.

‘సిక్‌లీవ్‌ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్‌ లేటర్‌లో కంపెనీ తెలిపింది.

విలీనంతో.. భారీగా జీతాల కోత
బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.

ఇదిలాఉండగా, ఎయిరిండియా పట్ల క్రూ సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

Published date : 09 May 2024 11:24AM

Photo Stories