Sakshi education logo

Advertisement

డిగ్రీ ప్రవేశాలకు త్వరలో మరో దశ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కాలేజీల్లో మరో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కసరత్తు చేస్తోంది.
Edu newsఆగస్టు 7 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక దాంతో డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ముగించాలని భావిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం నిర్వహించిన స్పెషల్ రౌండ్ కౌన్సెలింగే చివరిదని అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని డిగ్రీ కాలేజీల్లోని పలు కోర్సుల్లో 15 మంది కంటే తక్కువ విద్యార్థులు చేరారు. అలాంటి కాలేజీల్లో కోర్సుల నిర్వహణ సాధ్యం కాదని, ఆ కోర్సులను రద్దు చేసుకోవాలని దోస్త్ ఇది వరకే యాజమాన్యాలకు తెలియజేసింది. ఆ కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇతర కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకునేలా సూచించాలని చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో పలువురు విద్యార్థులు ఆ కాలేజీల్లో సీట్లను కోల్పోగా ఇతర కాలేజీల్లో సీట్ల కోసం ఆప్షన్లు ఇచ్చుకోలేకపోయారు. మరికొన్ని కాలేజీలకు చెందిన విద్యార్థులకు యాజమాన్యాలు చివరి క్షణంలో ఈ విషయాన్ని తెలియజేయడంతో ఆప్షన్లు ఇచ్చుకున్నా నచ్చిన కాలేజీల్లో సీట్లను పొందలేకపోయారు. దీంతో వారందరికీ మరో అవకాశం ఇవ్వాలని దోస్త్ నిర్ణయానికి వచ్చింది. దానికంటే ముందే ఆగస్టు 5, 6 తేదీల్లో ఇంట్రా కాలేజీ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఇందులో విద్యార్థులు ఆ కాలేజీ పరిధిలోనే కోర్సులను మార్చుకోవచ్చని తెలిపారు. అది పూర్తయ్యాక చివరగా ఒక కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు యాజమాన్యాలు దోస్త్ కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని గతంలోనే కలిసి కోరాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్‌ను యాజమాన్య ప్రతినిధులు కలసి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్.. విద్యాశాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. దీంతో స్పాట్ అడ్మిషన్లకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని డిగ్రీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, పరమేశ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని లింబాద్రి పేర్కొన్నారు. ఒకవేళ స్పాట్ అడ్మిషన్లను అవకాశం ఇచ్చినా స్పాట్‌లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని వెల్లడించారు. గతంలోనే ఈ మేరకు ప్రభుత్వం సంక్షేమ శాఖలకు ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అందులో చేరే విద్యార్థులే పూర్తి ఫీజులను భరించాల్సి ఉంటుందని తెలిపారు.
Published on 8/2/2019 3:53:00 PM

సంబంధిత అంశాలు